Wheet: గోధుమలంటే అలర్జీ... రోటీలు తినలేక ఉత్తరాది యువతి ఆత్మహత్య!
- బీటెక్ చదివి ఉద్యోగం చేసే యువతి
- ఆహారం లేక 32 కిలోలకు తగ్గిన బరువు
- మనస్తాపంతో ఆత్మహత్య
గోధుమలు, గోధుమలతో చేసే వంటలంటే అలర్జీతో బాధపడుతున్న ఆమె, ఆహారం తీసుకోకుండా బక్క చిక్కి, చివరకు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, జీంద్ ప్రాంతంలో నివాసం ఉండే సురభి (25)కి గోధుమలంటే అలర్జీ. వాటిని చూస్తేనే తట్టుకోలేకపోయేది. ఉత్తరాదిలో ప్రధాన ఆహారమే గోధుమలన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గోధుమలతో చేసిన ఏ ఆహారాన్నీ ఆమె ముట్టేది కాదు. బీటెక్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే ఆమెకు వైద్యం చేయించాలని తల్లిదండ్రులు ప్రయత్నించినా కుదర్లేదు. దీంతో ఆమె క్రమంగా తన బరువును కోల్పోయింది. 52 కిలోల బరువుండే ఆమె 32 కిలోల బరువుకు తగ్గిపోయింది. రొట్టెలు తింటే తలనొప్పి, కడుపునొప్పితో బాధపడుతుండే ఆమె, దాన్ని మానేసి, బియ్యం, పల్లీలపై ఆధారపడినా బరువులో మార్పులేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమె తన చున్నీతో ఉరి వేసుకుని మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.