damodar reddy: టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకోండి: షబ్బీర్ అలీ డిమాండ్
- పార్టీ ఫిరాయించిన దామోదర్ పై చర్యలు తీసుకోవాలి
- సాక్ష్యాధారాలను స్వామిగౌడ్ కు అందజేస్తాం
- కేసీఆర్ క్రెడిబిలిటీ ఏమిటో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు
టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. దామోదర్ పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన సాక్ష్యాధారాలను శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు అందించబోతున్నామని చెప్పారు. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గతంలో కేసీఆర్ టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుదారులపై తాము ఫిర్యాదు ఇస్తే పట్టించుకోని స్వామిగౌడ్... ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే... టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీపై తొలి సంతకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని షబ్బీర్ అన్నారు. నిరుద్యోగ భృతిపై కేసీఆర్ అప్పుడే మాట మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ క్రెడిబిలిటీ ఏమిటో, కేసీఆర్ క్రెడిబిలిటీ ఏమిటో జనాలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఇంట్లో కూర్చోబోమని... ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.