siricilla: ఆ బారానా అభివృద్ధి కూడా చేసి చూపిస్తా: సిరిసిల్లలో కేటీఆర్
- మెట్ట ప్రాంత రైతాంగం కేసీఆర్ ని మరిచిపోదు
- తరతరాలు గుర్తుచేసుకునేలా అభివృద్ధి చేస్తాం
- రాబోయే ఆరు నెలల్లో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం
సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చారానా మాత్రమేనని ఇంకా జరగాల్సింది బారానా ఉందని నాడు ఎన్నికల ప్రచార సమయంలో తాను చెప్పిన మాటలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిరిసిల్లో ఆ బారానా అభివృద్ధి కూడా చేసి చూపిస్తానని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని, తాగునీటి సమస్యను తొంభై ఐదు శాతం పరిష్కరించుకున్నామని, ఇంకా ఐదు శాతం మిగిలి ఉందని, ఎండాకాలం లోపు పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇక సాగునీటి విషయాని కొస్తే రాబోయే ఆరు నెలల్లోపే సిరిసిల్ల నియోజకవర్గంతో పాటు జిల్లాలోని మొత్తం రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మెట్ట ప్రాంత రైతాంగం మొత్తం కేసీఆర్ పేరుని మరిచిపోకుండా, ఆయన నాయకత్వాన్ని తరతరాలు గుర్తుచేసుకునేలా అభివృద్ధి చేస్తామని అన్నారు.