Congress: ఆప్ తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత!
- కాంగ్రెస్-ఆప్ పొత్తుపై హైకమాండ్ దే నిర్ణయం
- ఇటీవల విపక్షాల సమావేశానికి ఆప్ హాజరు
- పొత్తును వ్యతిరేకిస్తున్న స్థానిక కాంగ్రెస్ నేతలు
దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మోదీ సర్కార్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీనికి ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇదే అదునుగా భావించిన విపక్షాలు.. బీజేపీ సర్కార్ ను దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న, మొన్నటి దాకా కారాలు, మిరియాలు నూరుకున్న పార్టీలు సైతం ఏకమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ జత కట్టగా.. అదే బాటలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆప్ తో పొత్తుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలాదీక్షిత్ స్పందించారు. పొత్తులపై కాంగ్రెస్ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
పొత్తులపై చర్చలు?
దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్-ఆప్‌ల మధ్య ఇటీవల సయోధ్య కుదిరినట్లుగా సమాచారం. తెరవెనుక ఇరు పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్ తో పాటు ఆప్ నేతలు కూడా హాజరుకావడం ఊహాగానాలకు బలం చేకూర్చింది. అంతేకాకుండా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ హాజరయ్యారు. ఈ పరిణామాలు పొత్తులకు ఊతమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆప్ తో పొత్తు స్థానిక కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేనట్టుగా తెలుస్తోంది. 2019 ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆప్ తో పొత్తుపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.