Gold: డిమాండ్ తగ్గడంతో.. దిగొస్తున్న పసిడి ధరలు
- పెళ్లిళ్ల సీజన్ లేక తగ్గిన డిమాండ్
- రూ.210 తగ్గిన గోల్డ్, అదే బాటలో వెండి
- అంతర్జాతీయ పరిణామాలే కారణం
బంగారం ప్రియులకు ఇది శుభవార్తే. పసిడి ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. మంగళవారం స్వల్పంగా పెరిగినా.. ఇవాళ మళ్లీ తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ లేకపోవడంతో అమాంతంగా పుత్తడి డిమాండ్ పడిపోయింది. దీంతో బంగారం ధర రూ.32 వేల దిగువకు చేరింది. నగల వర్తకుల నుంచి డిమాండ్ లేకపోవడం వల్లే ధరలు తగ్గుముఖం పట్టినట్లుగా ట్రేడింగ్ వర్గాలు భావిస్తున్నాయి.
అంతేకాకుండా అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు కూడా పసిడి ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని వెల్లడించాయి. అందువల్లే నేటి ట్రేడింగ్లో పసిడి ధర రూ.210 తగ్గి.. 10 గ్రాముల బంగారం రూ. 31,850కు చేరింది. ఇక ఇదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. రూ.435 తగ్గడంతో కిలో వెండి రూ.37,880కి చేరింది.