Hyderabad: చలికి తట్టుకోలేక ఇంట్లో బొగ్గుల కుంపటి.. పొగకు ఊపిరాడక తల్లీకొడుకుల మృతి!
- హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో సంఘటన
- వెచ్చదనం కోసం ఇంట్లో బొగ్గుల కుంపటి
- ఇల్లంతా పొగ వ్యాపించడంతో దారుణం
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చలి తీవ్రత ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. చలి బారిన పడకుండా ఎవరి జాగ్రత్తలు వారు పాటిస్తున్నారు. అయితే, చలికి తట్టుకోలేక వెచ్చదనం కోసం తమ ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్న ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఈ విషాద ఘటన జరిగింది.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 లోని ఓ ఇంట్లో పని మనుషులుగా బుచ్చివేణి (37), ఆమె కుమారుడు పద్మరాజు (20) పనిచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం వీరిది. చలి తీవ్రత పెరగడంతో వెచ్చదనం కోసం తమ ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్నారు. ఇల్లంతా పొగ వ్యాపించడంతో ఊపిరాడక వీళ్లిద్దరూ మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.