Nandyal: 'మనీ మేక్స్ మనీ' అంటూ ప్రచారం.. వాట్సాప్ గ్రూపును రూ. 20 కోట్లకు ముంచేసిన మోసగాడు!

  • నంద్యాల కేంద్రంగా ఘరానా మోసం
  • వాట్స్ యాప్ లో ప్రచారం చేసి డబ్బు దండుకున్న యువకుడు
  • దాదాపు 2 వేల మంది బాధితులు

మనీ మేక్స్ మనీ (ఎంఎంఎం) వినడానికి బాగానే ఉంది. డబ్బు పెడితే, మరింత డబ్బు వస్తుంది... ఇదే ప్రచారం చేసిన ఓ యువకుడు రూ. 20 కోట్ల మేరకు యువతను ముంచేశాడు. కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ ఇతని బాధితులు వందలాది మంది ఉన్నట్టు తెలుస్తోంది. వాట్స్ యాప్ గ్రూప్, యూట్యూబ్ వీడియోలు చూపిస్తూ, తన ముఖం కనిపించకుండా అతనీ దందాను సాగించడం గమనార్హం.

పోలీసుల వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కర్నూలు జిల్లా నంద్యాల, నూనెపల్లెకు చెందిన వెంకటకృష్ణ (28), సుమారు 2 వేల మందిని మోసం చేశాడు. ఈ సంవత్సరం జూన్ 5న 'ఎంఎంఎం' పేరిట వాట్స్ యాప్ గ్రూప్ ప్రారంభించిన వెంకటకృష్ణ, తాను చెప్పిన ఖాతాల్లో డబ్బులు వేస్తే, అధిక మొత్తంలో తిరిగి చెల్లిస్తానని ప్రచారం చేశాడు. గ్రూప్ లో మాత్రమే సభ్యులతో మాట్లాడేవాడు. అతన్ని చూడాలని కొందరు అడిగితే, తాను బయటపడితే ఐటీ సమస్యలు వస్తాయని నమ్మకంగా చెప్పేవాడు.

ఇక అతని మాటలు నమ్మి ఎంతోమంది డబ్బులు బ్యాంకు ఖాతాల్లో వేశారు. తామంతా మోసపోయామని తెలిసినా, ఎవరూ ఈ కేసుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. రెండు రోజుల క్రితం ఓ బాధితుడు వెంకటకృష్ణ దొరికాడని, నంద్యాల త్రీ టౌన్ పీఎస్ లో ఉన్నాడని తమ గ్రూప్ లో మెసేజ్ పెట్టడంతో దాదాపు 30 మంది బాధితులు పరుగు పరుగున పోలీసుల వద్దకు వచ్చారు. వారినుంచి వివరాలు సేకరించిన పోలీసులు, ఎక్కడ మోసపోయారో అక్కడే కేసు పెట్టాలని సలహా ఇచ్చి వారిని పంపించారు. వెంకటకృష్ణ ఆచూకీ కోసం తాము కూడా ప్రయత్నిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News