Konatala Ramakrishna: ఓ పార్టీలో చేరుతా... ఏ పార్టీ అన్నది త్వరలో చెబుతా: కొణతాల రామకృష్ణ
- ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది
- ప్రతిపక్షాల అనైక్యతే తెలుగుదేశం పార్టీ బలం
- జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి సారించని పవన్
"నేను ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఓ పార్టీలో చేరుతాను. అది ఏ పార్టీ అన్న విషయాన్ని అతి త్వరలోనే వెల్లడిస్తా" అని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఓ దినపత్రికతో మాట్లాడిన ఆయన, రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయని, రాజకీయ వాతావరణం వేడెక్కిందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి చివరిలో నోటిఫికేషన్ రావచ్చన్న వార్తలను ప్రస్తావించిన ఆయన, ప్రతిపక్షాల మధ్య ఉన్న అనైక్యతను తెలుగుదేశం తనకు అనుకూలంగా మలచుకుంటోందని అన్నారు. వైసీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, బీజేపీ తదితరాలు ఎవరి దారిన వాళ్లు వెళ్లడం వల్ల టీడీపీ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు.
ఎన్నికల తరువాత బీజేపీ మంత్రాంగాన్ని నడిపించి, పవన్, జగన్ ల మధ్య సఖ్యత కుదిర్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని, జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ తగినంత కృషి చేయడం లేదని కొణతాల వ్యాఖ్యానించారు.