Rajasthan: ‘ఇట్స్ డన్’.. రుణమాఫీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్!
- రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో రుణమాఫీ ప్రకటన
- రుణమాఫీపై రాహుల్ ట్వీట్
- రెండు రోజుల్లోనే చేశామన్న కాంగ్రెస్ చీఫ్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ‘‘ఇట్స్ డన్’’ అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పది రోజుల్లో రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చామని, కానీ రెండు రోజుల్లోనే ఆ పని పూర్తి చేశామని పేర్కొన్నారు. ‘‘మేం పది రోజులు అడిగాం.. కానీ రెండు రోజుల్లోనే ఆ పని చేశాం’’ అని రాహుల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణాలను పది రోజుల్లోనే మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్టే మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు రూ. 2 లక్షల మేర రైతు రుణాలను మాఫీ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు గంటల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించగా, గెహ్లట్ రెండు రోజుల తర్వాత ప్రకటించారు.