New Delhi: కుమార్తెపై అత్యాచారం చేశాడన్న అపవాదుతోనే తండ్రి మరణం... చనిపోయిన తరువాత నిర్దోషని తేల్చిన కోర్టు!
- 17 సంవత్సరాల క్రితం కేసులో తుది తీర్పు
- తండ్రే అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసిన బాలిక
- పదేళ్ల శిక్ష విధించిన సెషన్స్ కోర్టు
- పోలీసుల విచారణ తీరు సరిగా లేదన్న ఢిల్లీ హైకోర్టు
కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ తండ్రిని అవమానించారు. తాను తప్పు చేయలేదని ఎంతగా మొత్తుకున్నా వినలేదు. పోలీసులు అరెస్ట్ చేయగా, ట్రయల్ కోర్టు పది సంవత్సరాల జైలుశిక్ష కూడా విధించింది. ఆ శిక్షను అనుభవిస్తూనే అతను కన్నుమూయగా, ఆపై హైకోర్టు, అతను ఏ తప్పూ చేయలేదని, అతను నిర్దోషని తేల్చింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చిన ఈ కేసు వెనుక పూర్వపరాలను పరిశీలిస్తే, 17 సంవత్సరాల క్రితం ఓ మైనర్ బాలిక తనపై అత్యాచారం జరిగిందని, తండ్రే తనను రేప్ చేశాడంటూ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు, అతనిపైనే కేసు పెట్టారు. ఈ కేసులో తాను నిరపరాధినని, ఎవరో తన కుమార్తెకు మత్తుమందిచ్చి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని మొత్తుకున్నాడు.
ఈ అత్యాచారం ఫలితంగా బాలిక గర్భం దాల్చడంతో, జనవరి 1996లో అతన్ని అరెస్ట్ చేయగా, ట్రయల్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. తనకు డీఎన్ఏ టెస్ట్ చేయించాలని, బాలిక గర్భంలోని రక్త నమూనాలు సేకరించి పరీక్షించాలని అతను చేసిన వినతిని పోలీసులు, కోర్టు అంగీకరించలేదు.
తన భర్త మంచివాడని, ఇంత ఘోరం చేసుండడని చెబుతూ ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కన్న బిడ్డపై అత్యాచారం చేశాడన్న నిందను మోస్తూనే అవమానభారంతో ఆ తండ్రి కన్నుమూశాడు. అతను మరణించిన 10 నెలల తరువాత అతను నిర్దోషని హైకోర్టు తీర్పిస్తూ కింది కోర్టు, పోలీసులు ఏకపక్ష విచారణ జరిపారని ఆరోపించింది.
ఈ కేసులో లోతైన విచారణ జరపడంలో పోలీసులు విఫలమయ్యారని, తండ్రిపై నిందమోపి చేతులు దులిపేసుకున్నారని జస్టిస్ ఆర్కే గౌబా అభిప్రాయపడ్డారు. ఈ కేసులో విచారణ సక్రమంగా జరిగివుంటే, ఓ నిరపరాధిపై ఇంతటి నింద పడి ఉండేది కాదని తీర్పు సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.