Prabhas: ప్రభాస్ కు నేడు కూడా నిరాశే... ఇంటి సీజ్ పై విచారణ వాయిదా!
- శేరిలింగంపల్లి ప్రభుత్వ భూముల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్
- మూడు రోజుల క్రితం రెవెన్యూ అధికారుల సీజ్
- స్టే విధించాలని హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్
- వాదనలు రేపు వింటామన్న ధర్మాసనం
హైదరాబాద్ శివార్లలోని శేరిలింగంపల్లి పరిధిలో తాను కొనుగోలు చేసి క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న ఇంటిని రెవెన్యూ అధికారులు అన్యాయంగా సీజ్ చేశారని ఆరోపిస్తూ, హైకోర్టును ఆశ్రయించిన హీరో ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్ కు నేడు కూడా నిరాశే ఎదురైంది. ఈ కేసులో స్టే విధించాలని ఆయన కోరుతూ నిన్న కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ ఉదయం కేసును విచారణకు స్వీకరించిన ధర్మాసనం, వాదనలు వింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్, ఈ వివాదంపై ఇప్పటికే విచారణ జరుగుతోందని గుర్తు చేస్తూ, ప్రభుత్వ భూమిలో ఆక్రమణలపై నడుస్తున్న అదే కేసులో ప్రభాస్ పిటిషన్ ను చేర్చవచ్చని అన్నారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ప్రభాస్ తరఫు న్యాయవాది వాదించినా, వాదనలు రేపు వింటామని చెబుతూ, కేసును శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.