polavaram: పక్కరాష్ట్రంతో జగన్ చేతులు కలిపి పోలవరాన్ని అడ్డుకునే కుట్ర చేస్తున్నారు: మంత్రి దేవినేని ఆరోపణ
- చెల్లింపుల్లో అక్రమాలంటూ నిస్సిగ్గు కథనాన్ని అల్లారని ధ్వజం
- పోలవరానికి కేంద్రమే అవార్డు ఇచ్చిన విషయం గుర్తులేదా అని ప్రశ్న
- విపక్షానివి చౌకబారు ఆరోపణలని ఎద్దేవా
పోలవరం పూర్తయితే తనకు రాజకీయ మనుగడ ఉండదన్న భయంతో వైసీపీ అధినేత జగన్ అర్థం పర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని, పక్క రాష్ట్రంతో చేతులు కలిపి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ప్రగతి చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, అందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం చెల్లింపుల్లో అక్రమాలు నిజమేనంటూ ఓ మంత్రి పేరుతో నిస్సిగ్గుగా కథనం అల్లారని, వాస్తవానికి పోలవరం అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతున్న ప్రాజెక్టు అని కేంద్రమే అవార్డు ఇచ్చిన విషయం మర్చిపోయారా? అని ఎదురు ప్రశ్నించారు.
జగన్ తన రాజకీయ స్వార్థం కోసం రైతులు, ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం పూర్తిచేసి తీరుతామని స్పష్టం చేశారు. పోలవరం పనులు ఇప్పటి వరకు 62.61 శాతం పూర్తయ్యాయని, కేంద్రం నుంచి ఇంకా 3,342 కోట్లు విడుదల కావాల్సి ఉందని చెప్పారు.