Hyderabad: "చనిపోవాలన్న నా నిర్ణయం తప్పే... అయినా తప్పడం లేదు"... వేధింపులు తాళలేని సీఎంఎస్ ఇన్ఫోసిస్ ఉద్యోగి సూసైడ్ నోట్!
- హైదరాబాద్ లో ఘటన
- మృతదేహంతో బంధువుల నిరసన
- విచారణ ప్రారంభించిన పోలీసులు
ఓ సీనియర్ అధికారి వేధింపులను తట్టుకోలేకపోయిన ఓ చిరుద్యోగి తల్లి, భార్య, బిడ్డల పేరిట లేఖ రాసి తనువు చాలించాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న సీఎంఎస్ ఇన్ఫోసిస్ లో పని చేస్తున్న నూతలగంటి నర్సింగ్ (30)ను గత కొంతకాలంగా కర్నాల్ కార్తీక్ అనే ఉన్నతోద్యోగి వేధిస్తున్నాడు. అతని వేధింపులకు తట్టుకోలేకపోయిన నర్సింగ్, తాను ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అనుకోలేదని, తన కుమార్తె తాను లేకుండా ఎలా బతుకుతుందోనని సూసైడ్ నోట్ లో వాపోయాడు.
ఆఫీసులో జరుగుతున్న పరిణామాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇది తప్పని తెలిసినా, తనకు తప్పడం లేదని లేఖలో పేర్కొన్నాడు. కొత్తగా వచ్చిన కర్నాల్, తనను తాను నిరూపించుకునేందుకు నన్ను బలిపశువును చేసి, పరువు తీశాడని పేర్కొన్నాడు. క్షమించాలని తల్లిని, భార్యను కోరే అర్హత తనకు లేదని, ఓ భర్తగా, తండ్రిగా, కొడుకుగా ఓడిపోయానని చెప్పాడు. ప్రధాని నరేంద్ర మోదీ జీవితాంతం భారత ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించగా, వారు కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఇటీవలి కాలంలో తోటి ఉద్యోగులు నర్సింగ్ ను దూషిస్తూ ఉన్నారని, అతన్ని కొట్టారని కూడా తెలుస్తోంది. నర్సింగ్ తన సూసైడ్ నోట్ లో రాసిన అంశాల ఆధారంగా విచారణ చేపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.