jagan: సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తానని మేనిఫెస్టోలో జగన్ పెట్టాలి: సోమిరెడ్డి
- వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వారు కూడా విమర్శిస్తున్నారు
- వ్యవసాయరంగంలో ఏపీ 11 శాతం వృద్ధి రేటు సాధించింది
- వ్యవసాయం చేస్తే రైతుల కష్టాలు జీవీఎల్ కు తెలుస్తాయి
వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయం అంటే తెలియని వారు కూడా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణను చూసి నేర్చుకోవాలని ఇక్కడి నేతలు మాట్లాడుతుండటం దారుణమని చెప్పారు. జగన్, పవన్ లకు వ్యవసాయం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. గత నాలుగేళ్ల కాలంలో వ్యవసాయానికి రూ. 41 వేల కోట్లు ఖర్చు చేశామని... ఇదే సమయంలో తెలంగాణ కేవలం రూ. 23 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు.
వ్యవసాయరంగంలో ఏపీలో 11 శాతం వృద్ధి రేటును సాధించిందని... తెలంగాణలో 2.73 శాతం వృద్ధి రేటు నమోదైందని సోమిరెడ్డి చెప్పారు. అసెంబ్లీకి హజరుకాని వారికి పార్టీ అవసరమా? అని ప్రశ్నించారు. సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తాననే విషయాన్ని వైసీపీ మేనిఫెస్టోలో జగన్ పెట్టాలని అన్నారు. వ్యవసాయం చేస్తే రైతుల కష్టాలు ఎలా ఉంటాయో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుకు తెలుస్తుందని చెప్పారు.