rafel: రాఫెల్ స్కామ్ కు సంబంధించి జేపీసీ ఏర్పాటు చేయాలి!: వీరప్ప మొయిలీ డిమాండ్
- దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘రాఫెల్’
- రెండొందల శాతం అంచనాలు పెంచారు
- సుప్రీంకోర్టుకు కేంద్రం తప్పుడు నివేదికలు ఇచ్చింది
‘రాఫెల్’ వివాదంపై ఎటువంటి విచారణ అవసరం లేదని, ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన పని లేదని సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, ‘రాఫెల్’ పై కాంగ్రెస్ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ దీనిపై స్పందించారు.
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘రాఫెల్’ అని, దేశభద్రతను పణంగా పెట్టి ఈ ఒప్పందం చేసుకున్నారని బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. రెండొందల శాతం అంచనాలు పెంచి ఈ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు కేంద్రం తప్పుడు నివేదికలు ఇచ్చిందని ఆరోపించిన మొయిలీ, దీనికి సంబంధించిన ‘కాగ్’ నివేదికను పీఏసీకి ఇంతవరకూ ఇవ్వలేదని అన్నారు. రాఫెల్ స్కామ్ కు సంబంధించి జేపీసీ వేయాలని ఈ సందర్భంగా వీరప్ప మొయిలీ డిమాండ్ చేశారు.