1984 riots case: పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు గడువు కోరిన సజ్జన్ కుమార్
- సజ్జన్ కుమార్ కు యావజ్జీవ శిక్ష
- ఈ నెల 31లోగా పోలీసులకు లొంగిపోవాలన్న కోర్టు
- నెల రోజులు గడువు కావాలన్న సజ్జన్
1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత సజ్జన్ కుమార్ ని దోషిగా తేలుస్తూ ఢిల్లీ హైకోర్టు నాలుగు రోజుల క్రితం తీర్పు నిచ్చింది. ఈ కేసులో యావజ్జీవ శిక్ష పడ్డ సజ్జన్ కుమార్ ని ఈ నెల 31 లోగా పోలీసులకు లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే, పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు తనకు నెల రోజుల గడువు కావాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో సజ్జన్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, ఇదే కేసుకు సంబంధించిన రెండో కేసు విచారణ ఈరోజు ఢిల్లీ హైకోర్టులో జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు సజ్జన్ హాజరయ్యారు. తన తరపు న్యాయవాది అందుబాటులో లేని కారణంగా ఈ కేసు విచారణను వాయిదా వేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సజ్జన్ కుమార్ విజ్ఞప్తి మేరకు ఈ కేసు విచారణను జనవరి 22కు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు సజ్జన్ తన మొబైల్ ఫోన్ ను న్యాయస్థానానికి అందజేశారు.