modi: మోదీ ఇంకా కాస్త మగతలోనే ఉన్నట్టున్నారు!: రాహుల్ గాంధీ
- గబ్బర్ సింగ్ ట్యాక్స్ పై మోదీని నిద్ర లేపాం
- మా సూచనలను ఒకప్పుడు పనికిమాలిన ఐడియాలుగా విమర్శించారు
- ఇప్పుడు వాటినే అమలు చేయాలనుకుంటున్నారు
ప్రధాని మోదీని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి టార్గెట్ చేశారు. 18 శాతం లేదా అంతకన్నా తక్కువ శాతాల జీఎస్టీ శ్లాబుల్లోకి 99 శాతం వస్తువులను తీసుకొస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై రాహుల్ స్పందించారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ పై గాఢ నిద్రలో ఉన్న మోదీని ఎట్టకేలకు లేపగలిగామని... అయినా, ఆయన ఇంకా కొంత మగతలోనే ఉన్నట్టున్నారని ఎద్దేవా చేశారు. తమ సూచనలను ఒకప్పుడు పనికిమాలిన ఐడియాలుగా విమర్శించిన మోదీ... ఇప్పుడు వాటినే అమలు చేయాలనుకుంటున్నారని అన్నారు. అసలు చేయకపోవడం కంటే... ఆలస్యంగానైనా చేయడం మంచిదే మోదీ గారు అంటూ ట్వీట్ చేశారు.
జీఎస్టీలో అధిక పన్నులు ఉన్నాయని, 28 శాతం శ్లాబును పూర్తిగా ఎత్తేసి 18 శాతం వరకే ఉంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, కేవలం విలాసవంతమైన వస్తువులనే 28 శాతం శ్లాబులో ఉంచుతామని తెలిపారు.