Andhra Pradesh: జనవరి 6 తర్వాత ఏపీలో టీడీపీకి దినదినగండమే: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి జోస్యం
- టీడీపీ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు
- ఆ వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరు
- కేంద్రం శ్వేతపత్రం విడుదల చేస్తే..
- టీడీపీ నేతలు మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారు?
ఏపీలో జనవరి 6 తర్వాత టీడీపీకి దినదినగండమేనంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, టీవీల ముందుకొచ్చి తమ ఇష్టానుసారం మాట్లాడుతున్న టీడీపీ నేతలను ప్రజలు పట్టించుకోరని, వారి వ్యాఖ్యలను ఎవరూ పరిగణనలోకి తీసుకోరని అన్నారు.
ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని టీడీపీ నేత బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపై ఆయన సెటైర్లు విసిరారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశావని టీడీపీ అధిష్ఠానం రేపు ఆయన్ని ప్రశ్నించకుండా ఉండదని, అప్పుడు, టీవీలకు ముఖం చాటేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తే, టీడీపీ నేతలు వారి మొఖాలను ఎక్కడ పెట్టుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, జనవరి 6న ప్రధాని నరేంద్రమోదీ ఏపీలోని గుంటూరులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీపై విష్ణువర్ధన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.