bjp: బీజేపీపై విమర్శకు ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలనే ఆయుధంగా మలచుకున్న ‘శివసేన’!
- మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైంది
- అయినప్పటికీ మేల్కోవడం లేదు
- కుంభకర్ణుడిలా నిద్రపోతోంది: ‘సామ్నా’లో విమర్శలు
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలలో బీజేపీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీపై శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ విమర్శలు గుప్పించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భగవద్గీతలోని ఓ విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు.
బీజేపీపై విమర్శలకు దీనినే శివసేన ఉపయోగించుకోవడం గమనార్హం. ‘నేను చేస్తున్నదే గొప్ప, నేనే చేశాను.. అని చెప్పుకుంటూ అహంభావం ప్రదర్శిస్తే ఏం ఉపయోగం?’ అన్న భగవద్గీతలోని అంశాన్ని మోహన్ భగవత్ ఇటీవల ప్రస్తావించారని ‘సామ్నా’ పేర్కొంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగాలని ప్రజలందరూ కోరుకోవడం వల్లనే 2014లో బీజేపీకి పట్టం కట్టారని, ఈ విషయమై బీజేపీ ఇప్పటికీ స్పందించడం లేదని విమర్శించింది.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైనప్పటికీ మేల్కోవడం లేదని, కుంభకర్ణుడిలా నిద్రపోతోందని తీవ్ర విమర్శలు చేసింది. మందిర నిర్మాణం విషయమై బీజేపీపై చాలా ఒత్తిడి ఉందని, అన్ని సమావేశాల్లోనూ ఈ అంశంపై ప్రశ్నలు వస్తున్నప్పటికీ, ఆ పార్టీ అధిష్ఠానం వద్ద సరైన సమాధానాలు లేవని ‘సామ్నా’ ఘాటు వ్యాఖ్యలు చేసింది.