Andhra Pradesh: సంక్రాంతి తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు.. తొలి జాబితాలో 100 మందికి ఛాన్స్!
- ఉండవల్లిలో నేడు 10.30 గంటలకు భేటీ
- టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
- ఎమ్మెల్యేలపై నివేదికలు తెప్పించుకున్న అధినేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో మరికాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను సంక్రాంతి తర్వాత ప్రకటిస్తామని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ రోజు ఉదయం 10.30 గంటలకు జరిగే సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇప్పటికే చాలామంది నేతల పనితీరుపై చంద్రబాబు నివేదికలను తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్లు దక్కడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత టీడీపీ అధినేత తొలి జాబితాలో 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారుల ప్రమేయాన్ని తగ్గించి నేతలు ఎక్కువ చొరవ తీసుకోవాల్సిందిగా చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించనున్నారు.
అలాగే బూత్ స్థాయిలో కార్యకర్తల నియామకం, సభ్యత్వ నమోదును వారం రోజుల్లోగా పూర్తిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే జనవరిలో జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.