Congress: చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం నచ్చలేదు.. అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నాం!: కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్సీలు

  • స్వామిగౌడ్ కు లేఖ ఇచ్చిన నేతలు
  • పార్టీని విలీనం చేయాలని విజ్ఞప్తి
  • మీడియాతో మాట్లాడిన రెబెల్స్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తనకు ఎలాంటి అన్యాయం జరగలేదని ఆ పార్టీ తిరుగుబాటు నేత, ఎమ్మెల్సీ ఆకుల లలిత తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తనకు బాగా నచ్చాయని వెల్లడించారు. తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నామని ప్రకటించారు. శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ కు పార్టీ విలీనం విషయమై ఈరోజు లేఖ సమర్పించామని అన్నారు.

మరోవైపు సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు. చంద్రబాబు వచ్చి తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయడం తమకు నచ్చలేదన్నారు. టీఆర్ఎస్ లో బేషరతుగానే చేరుతున్నామనీ, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో లలిత, సంతోష్ కుమార్ తో పాటు మరో నేత పాల్గొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ కు శాసనమండలిలో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి మాత్రమే మిగిలారు. వీరి పదవీకాలం కూడా 2019, మార్చి నెలతో ముగియనున్న నేపథ్యంలో మండలిలో కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. 

  • Loading...

More Telugu News