Andhra Pradesh: టీడీపీ సమన్వయ కమిటీ భేటీ.. పార్టీ నేతలకు తలంటిన చంద్రబాబు!
- ప్రజలను, పార్టీని పట్టించుకోవడం లేదని ఆగ్రహం
- సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యంపై మండిపాటు
- పార్టీని మోసం చేయొద్దని హితవు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్నప్పటికీ పార్టీ నేతలు సీరియస్ గా ఉండటం లేదని మండిపడ్డారు. గట్టిగా తిడితే ప్రజల ముందు చులకన అవుతారన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు ఊరుకున్నానని వ్యాఖ్యానించారు.
ఉండవల్లిలో ఈరోజు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. తొలుత సభ్యత్వ నమోదుపై జిల్లాల వారీగా సమీక్ష చేపట్టారు. అయితే చాలాచోట్ల ఈ కార్యక్రమం మందకొడిగా సాగుతున్నట్లు తెలుసుకున్న టీడీపీ అధినేత పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా ప్రజాభిమానాన్ని పొందాలనీ, పార్టీని మోసం చేసి కాదని చురకలు అంటించారు. ఇటీవలి కాలంలో చాలామంది నేతల పనితీరు దిగజారిందని నివేదికలను ఉటంకిస్తూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.