Andhra Pradesh: రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే అభివృద్ధిలో ఆంధ్రా 25 ఏళ్లు ముందుకుపోతుంది!: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
- అనకాపల్లిలో నేడు పార్టీ కార్యాలయం ప్రారంభం
- హాజరుకానున్న రఘువీరా, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
- రాహుల్ ను గెలిపించాలని కిరణ్ పిలుపు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీచేసే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత 50 ఏళ్లలో దేశంలో జరిగిన ఎన్నికలు ఓ ఎత్తయితే.. 2019లో జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు మరో ఎత్తని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలు ముగిసిపోతే ప్రత్యేకహోదా డిమాండ్ పాతబడి పోతుందని హెచ్చరించారు. హోదాను సజీవంగా ఉంచాలంటే ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ మాట్లాడారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిపిస్తే ఏపీ అభివృద్ధిలో 25 ఏళ్లు ముందుకు పోతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఈ రోజు అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి అనకాపల్లి వరకూ కార్లతో భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. అనంతరం అనకాపల్లిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.