sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఆవిరైన రూ. 2.26 లక్షల కోట్ల సంపద
- అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలిన మార్కెట్లు
- 690 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- తీవ్ర ఒత్తిడికి గురైన బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు
దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో బ్లాక్ ఫ్రైడే నమోదైంది. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు కుప్పకూలాయి. దీంతోపాటు అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడం, బలహీనంగా ఉన్న రూపాయి మారకం విలువ మార్కెట్లపై ప్రభావం చూపాయి.
ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 690 పాయిట్లు పతనమై 35,742కి పడిపోయింది. నిఫ్టీ 198 పాయింట్లు కోల్పోయి 10,754కు దిగజారింది. మార్కెట్ల పతనంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఇన్వెస్టర్లకు చెందిన రూ. 2.26 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలోని 19 సెక్టార్లు నష్టాలను నమోదు చేశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.
టాప్ గెయినర్స్:
సీజీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ (7.97%), నవకార్ కార్పొరేషన్ (6.35%), షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (6.32%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్స్ (4.72%), శ్రీరాం సిటీ యూనియన్ ఫైనాన్స్ (4.51%).
టాప్ లూజర్స్:
గాడ్ ఫ్రే ఫిలిప్స్ (-5.32%), ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ (-5.10%), శ్రీరాం ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ (-5.05%), ఈ-క్లర్క్స్ సర్వీసెస్ (-4.80%), టాటా కమ్యూనికేషన్స్ (-4.76%).