NTR BIOPIC: ఎన్టీఆర్ గురించి చెప్పేంత వయసు నాకు లేదు!: నందమూరి కల్యాణ్ రామ్
- ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నది కమిట్ మెంట్, డెడికేషన్
- ఇంత గొప్ప బయోపిక్ తీయడం బాబాయ్ కే సాధ్యం
- ఈ బయోపిక్ కు నాలుగు పిల్లర్స్
తమ తాతయ్య ఎన్టీఆర్ గురించి చెప్పేంత వయసు, అంతటి జీవితం తనకు లేదని హీరో నందమూరి కల్యాణ్ రామ్ అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ నుంచి తాను నేర్చుకున్నది కమిట్ మెంట్, డెడికేషన్ అని చెప్పారు. తనను ఎంతో గొప్ప నటుడిని చేసి, ఆరాధించిన ప్రజలకు ఏదో ఇవ్వాలని ఎన్టీఆర్ అనుకుని ఎంతో చేశారని అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తిపై బయోపిక్ తీయడం ఒక్క తన బాబాయ్ తో తప్ప ఎవరి వల్ల కాదని అన్నారు.
ఇక ఈ బయోపిక్ లో తన తండ్రి నందమూరి హరికృష్ణ పాత్ర చేయాలని బాబాయ్ బాలకృష్ణ తనను అడిగినప్పుడు.. ఇంత కన్నా అదృష్టమేముంటుందని చెప్పానని అన్నారు. అందుకే, బాబాయ్ ఆ విషయం చెప్పగానే చాలా సంతోష పడ్డానని అన్నారు. తన ఫస్ట్ లుక్ చూసి 'అచ్చం అన్నయ్యలా ఉన్నావని' బాబాయ్ చెప్పడంతో ఈ పాత్రను పోషిస్తానన్న నమ్మకం తనకు కలిగిందని కల్యాణ్ రామ్ గుర్తుచేసుకున్నారు. ఈ బయోపిక్ కు నాలుగు పిల్లర్స్.. ఒకటి నిర్మాత బాబాయ్ బాలకృష్ణ, రెండోది దర్శకుడు క్రిష్, మూడోది సంగీత దర్శకుడు కీరవాణి, డీఓపీ బాబా, నాల్గోది బుర్రా సాయి మాధవ్ అని ప్రశంసించారు.