coal Cookery: శామీర్‌పేటలో దారుణం.. బొగ్గుల కుంపటి పొగకు ఊపిరాడక నలుగురు యువకుల మృతి
- యువకుల నిండు ప్రాణాలను బలిగొన్న బొగ్గుల కుంపటి
- మృతి చెందిన నలుగురిదీ ఒకే గ్రామం
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో విషాదం జరిగింది. చలి విపరీతంగా ఉండడంతో వెచ్చదనం కోసం రాజేసిన నిప్పుల కుంపటి నలుగురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గాధగాని అరవింద్‌గౌడ్(23), మొగుళ్ల శివశంకర్ (21)లు శామీర్‌పేట మండలంలోని బాబాగూడ గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి కోళ్ల ఫారాన్ని అద్దెకు తీసుకున్నారు. అందులో పనిచేసేందుకు తమ గ్రామానికే చెందిన చిన్నబోయిన మహేశ్ ముదిరాజ్(22)ను నెల రోజుల క్రితం పిలిపించుకున్నారు.
ముగ్గురూ కలిసి ఐదు రోజుల క్రితం కొనుగోలు చేసిన 14 వేల కోడి పిల్లలకు గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు టీకాలు వేశారు. అదే మండలంలోని మజీద్‌పూర్‌లోని మరో కోళ్ల ఫారంలో పనిచేస్తున్న వెంకటాపురానికే చెందిన పోరెడ్డి మహేందర్ రెడ్డి (24) స్నేహితులను కలిసేందుకు వచ్చాడు. అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. అయితే, చలిగా ఉండడంతో వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటిని రాజేశారు. అయితే, అదే తమ నిండు ప్రాణాలను బలిగొంటుందని ఊహించలేకపోయారు.
శుక్రవారం ఉదయం కోళ్లఫారం వద్దకు వచ్చిన యజమాని సుధాకర్ రెడ్డి.. అక్కడ ఎవరూ లేకపోవడంతో వారి గదివద్దకు వెళ్లి చూశాడు. అక్కడ వారిని చూసి షాక్‌కు గురయ్యాడు. నలుగురూ చనిపోయి కనిపించడంతో కంగారు పడిన సుధాకర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుల మృతికి బొగ్గుల కుంపటి నుంచి వెలువడిన పొగే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. తలుపులు, కిటికీలు మూసివేయడంతో కుంపటి నుంచి వెలువడిన పొగ గదిని కమ్మేసి వారికి ఊపిరి ఆడకుండా చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. వైద్యులు కూడా వారి మృతికి పొగే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పొగవల్ల టీకా మందు విషంగా మారి వారి మరణానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.