Donald Trump: ట్రంప్ ప్రకటనపై విస్మయం.. రక్షణమంత్రి మ్యాటిస్ రాజీనామా
- బలగాల ఉపసంహరణపై ట్రంప్ సంచలన ప్రకటన
- ట్రంప్ ను కలసి వివరించిన మంత్రి
- తన నిర్ణయానికి కట్టుబడిన ట్రంప్
ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ సైనికులను పెద్ద సంఖ్యలో వెనక్కి రప్పించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటనపై ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ రాజీనామా చేయడం తీవ్ర సంచలనమైంది. సిరియా నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని మంగళవారం ట్రంప్ ప్రకటించి అందరనీ ఆశ్చర్యానికి గురిచేశారు. తాజాగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి బలగాలను ఉపసంహరిస్తున్నట్టు చేసిన ప్రకటన కలకలం రేపింది. దీనికి తోడు రక్షణ మంత్రి మ్యాటిస్ రాజీనామా మరింత సంచలనమైంది.
నిజానికి సిరియా, ఆఫ్ఘనిస్థాన్‌లలో ఉగ్రవాదుల పీచమణచేందుకు మరిన్ని బలగాలను పంపించాలని మ్యాటిస్ భావించారు. అయితే, అందుకు విరుద్ధంగా ఉన్న బలగాలనే వెనక్కి రప్పించాలన్న ట్రంప్ నిర్ణయం ఆయనను నిశ్చేష్టుడిని చేసింది. ఆ రెండు దేశాలకు బలగాలను పంపేందుకు ట్రంప్ అంగీకరించకపోవడంతోపాటు ఉన్న వాటినే ఉపసంహరిస్తున్న ట్రంప్ చేసిన ప్రకటనతో మ్యాటిస్ విస్మయానికి గురయ్యారు. ఆ వెంటనే ట్రంప్‌ను కలిసి ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, ట్రంప్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో మ్యాటిస్ మరో మార్గం లేక తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాశారు. తన స్థానంలో మరొకరిని నియమించుకోవాలని అందులో సూచించారు.