Khammam District: నాకు టీడీపీ రాజకీయ జన్మనిచ్చింది...పార్టీని వీడే ప్రసక్తి లేదు: అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
- సండ్రతో నిన్న ఖమ్మంలో చర్చలు
- ఇద్దరూ టీఆర్ఎస్లోకి వెళ్తున్నారని వార్తలు
- చంద్రబాబు సారధ్యంలోనే పనిచేస్తానని స్పష్టీకరణ
‘నాకు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని వదిలి వేరే పార్టీలో చేరే ప్రసక్తే లేదు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సారధ్యంలో ప్రజల కోసం పనిచేస్తా’ అని తెలంగాణలోని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాలో జోరుగా సాగుతున్న నేపధ్యంలో మెచ్చా నాగేశ్వరరావు ఈ ప్రకటన చేశారు.
కాంగ్రెస్కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరిపోవడంతో రాష్ట్రంలో వలసల ఊహాగానాలు జోరందుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారం దీనికి బలం చేకూర్చే సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నాయకులతో అంతర్గతంగా సమావేశమై రెండు గంటలపాటు చర్చించారు.
అనంతరం ఆశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో ఖమ్మం జిల్లా కేంద్రం సమీపంలోని ఓ ఇంట్లో కలుసుకుని మంతనాలు సాగించారు. టీఆర్ఎస్లోని ఓ ముఖ్య నాయకుని నుంచి తనకు పిలుపు అందిందని, పార్టీ మారుదామని నాగేశ్వరరావు వద్ద సండ్ర ప్రస్తావించగా ఆయన మౌనంగా విని వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే మెచ్చా తాను పార్టీ మారడం లేదని ప్రకటించడం గమనార్హం.