Konda Surekha: టీఆర్ఎస్ ఇప్పటికైనా కుటుంబ పెత్తనానికి స్వస్తి పలకాలి : మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ
- నాలాంటివాళ్లను ఓడించేందుకు రూ.50 కోట్ల చొప్పున ఖర్చుపెట్టారు
- ఎర్రబెల్లికి మంత్రి పదవి కోసం జూపల్లిని ఓడించారు
- గతంలో పార్టీ మారిన ఎమ్మెల్సీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్న
అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కనీసం రెండో విడతలోనైనా కుటుంబ పెత్తనానికి స్వస్తిపలికి ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలని పరకాల మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ సూచించారు. శనివారం ఆమె హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. మాట్లాడే వారిని కేసీఆర్ అసెంబ్లీలోకి రాకుండా చేశారన్నారు.
తనలాంటి వాళ్లను ఓడించేందుకు ఒక్కో నియోజకవర్గంలో రూ.50 కోట్ల వరకు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. ఎర్రబెల్లికి మంత్రి పదవి కట్టబెట్టేందుకు జూపల్లి కృష్ణారావును ఓడించారని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్సీలు పార్టీ మారితే నోరుమెదపని నాయకులు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అప్పట్లో పార్టీ మారిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అయినా తాము పదవులు పట్టుకుని వేలాడే రకం కాదని స్పష్టం చేశారు.