dk shiva kumar: తెలంగాణలో కాంగ్రెస్ ఓటమి ఎఫెక్ట్.. కర్ణాటకలో పదవి కోల్పోయిన డీకే శివకుమార్
- కర్ణాటక ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి నుంచి డీకేను తప్పించిన హైకమాండ్
- ఆయన స్థానంలో హెచ్ కే పాటిల్ నియామకం
- కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో డీకేది కీలకపాత్ర
కర్ణాటక కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి నుంచి డీకే శివకుమార్ ను పార్టీ అధిష్ఠానం తప్పించింది. ఆయన స్థానంలో మాజీ మంత్రి హెచ్ కే పాటిల్ ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ పేరుతో ప్రెస్ రిలీజ్ విడుదలైంది. పార్టీ అధినేత రాహుల్ గాంధీ అనుమతితోనే ఈ మార్పు జరిగినట్టు లేఖలో పేర్కొన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ లో అత్యంత ముఖ్యనేతల్లో డీకే శివకుమార్ ఒకరు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో, జేడీఎస్ తో కూటమి ఏర్పాటు చేయడంలో ప్రధానపాత్రను ఆయన పోషించారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆయనపై నమ్మకంతో తెలంగాణ ఎన్నికల రంగంలోకి కూడా ఆయనను పార్టీ హైకమాండ్ దించింది. తెలంగాణలో అసంతృప్తులను బుజ్జగించడం దగ్గర నుంచి, వ్యూహాలను రచించడం వరకు ఆయన కీలకంగా వ్యవహరించారు. అయితే, ఆయన వ్యూహాలు ఇక్కడ ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే, ప్రచార కమిటీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించినట్టు భావిస్తున్నారు.