Tamilnadu: 2019 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తాం.. ఘనవిజయం సాధిస్తాం!: కమలహాసన్
- మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించిన కమల్
- ప్రజల్లోకి వెళ్లి సిద్ధాంతాలను వివరిస్తున్న నటుడు
- మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా
మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధిల మరణంతో తమిళనాడు రాజకీయాల్లో రాజకీయ శూన్యం ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమలహాసన్ తాము రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ‘మక్కల్ నీది మయ్యం’ పేరుతో పార్టీ ప్రారంభించిన కమల్ తన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ కీలక ప్రకటన చేశారు.
2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే 39 స్థానాలకు గానూ 37 చోట్ల విజయదందుభి మోగించింది. మరోవైపు బీజేపీ, పీఎంకే చెరో సీటును దక్కించుకున్నాయి. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయాయి.