Amaravathi: అమరావతిలో దారుణం.. తండ్రీ కొడుకులను హత్య చేసి పూడ్చిపెట్టిన డ్రైవర్లు
- ఆయిల్ అమ్ముకుంటున్న డ్రైవర్లు
- మందలించినందుకు యజమానులపై కక్ష
- హత్య చేసి రోడ్డులో పూడ్చిపెట్టి పరారైన దుండగులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దారుణం జరిగింది. పొక్లెయిన్ యజమాని, అతడి కుమారుడిని దాని డ్రైవర్లు దారుణంగా హత్య చేశారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే వారి మృత దేహాలను పాతిపెట్టారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మేలవాయి గ్రామానికి చెందిన వేముల లక్ష్మయ్య (48), సురేశ్ (25) తండ్రీకొడుకులు. అమరావతిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల కోసం రెండు నెలల క్రితం తమ పొక్లెయిన్‌తో కలిసి అమరావతి చేరుకున్నారు. నిడమర్రు గ్రామంలో 14 సీడ్ యాక్సెస్ రోడ్డులో పనులు చేస్తున్నారు.
వీరి వద్ద జార్ఖండ్‌కు చెందిన నరేశ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా చేరాడు. ఆ తర్వాత అదే పేరుతో (నరేశ్) ఉన్న మరో వ్యక్తి వచ్చి వారి వద్ద చేరాడు. అయితే, పనులు చేస్తున్న సమయంలో వీరిద్దరూ ఆయిల్‌ను అమ్ముకుంటుండడంతో యజమానులు మందలించారు. మరోసారి ఆయిల్ అమ్ముకున్నట్టు తెలిస్తే జీతంలో డబ్బులు కట్ చేస్తామని హెచ్చరించారు.
ఈ క్రమంలో ఈ నెల14న డ్రైవర్లు ఇద్దరూ కలిసి యజమానుల వద్దకు వెళ్లి జీతం ఇవ్వాల్సిందిగా అడిగారు. దీనికి వారు.. అమ్ముకున్న ఆయిల్‌కు, జీతానికి చెల్లు అని చెప్పారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. ఇది మరింత ముదరడంతో డ్రైవర్లు ఇద్దరూ కలిసి తండ్రీ కొడుకులను హత్య చేశారు. అనంతరం అక్కడే రోడ్డుపై గొయ్యి తీసి మృతదేహాలను అందులో పాతిపెట్టారు. వారి వద్ద ఉన్న డబ్బు, సెల్‌ఫోన్లు తీసుకుని పరారయ్యారు.
నిత్యం ఇంటికి ఫోన్ చేసి మాట్లాడే లక్ష్మయ్య నుంచి ఫోన్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన భార్య వెంకలమ్మ తిరిగి ఫోన్ చేస్తే ఫోన్లు స్విచ్చాఫ్ వచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన ఆమె చిన్న కుమారుడు హరీశ్ మంగళగిరి వచ్చి తండ్రి, సోదరుడి గురించి ఆరా తీశాడు. వారి ఆచూకీ కనిపించకపోగా, వారి వద్ద పనిచేసే డ్రైవర్ల జాడ కూడా లేకపోవడంతో అనుమానం వచ్చిన హరీశ్ ఇతర కూలీల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
లక్ష్మయ్య, సురేశ్‌లు పనిచేసిన ప్రాంతాలు చదునుగా ఉండడంతో అనుమానం వచ్చిన కూలీలు శనివారం పోలీసులకు ఆ విషయం చెప్పారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ తవ్వకాలు జరపగా లక్ష్మయ్య మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. దీంతో రాత్రి 9 గంటల వరకు పోలీసులు తవ్వుతూనే ఉన్నారు. తిరిగి నేడు కూడా తవ్వకాలు కొనసాగించాలని నిర్ణయించారు.