Bollywood: సినిమాకు మంచి రోజులు మళ్లీ వచ్చాయి: వరుసపెట్టి ట్వీట్లు చేస్తున్న బాలీవుడ్ ప్రముఖులు
- సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గించడంపై హర్షం
- ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్
- మోదీకి కృతజ్ఞతలు
సినిమా టికెట్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. భారత చలన చిత్ర రంగానికి మంచి రోజులు మళ్లీ వచ్చాయని నటులు అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, అనుపమ్ ఖేర్, దర్శకుడు కరణ్ జోహార్ తదితరులు పేర్కొన్నారు.
ప్రభుత్వం తమ ఆందోళనను అర్థం చేసుకుందని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నాడు. ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు ఇది మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ సినిమాతో భారతీయ సినిమా పోటీ పడేందుకు ఇది మొదటి అడుగని స్టార్ యాక్టర్ ఆమీర్ ఖాన్ ట్వీట్ చేశాడు. సంవత్సరాంతంలో సినీ రంగానికి ఇది గొప్ప వార్త అని కరణ్ జోహార్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘సూపర్బ్ న్యూస్’’ అంటూ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశాడు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 20 వస్తువులపై జీఎస్టీని తగ్గించారు. వంద రూపాయల వరకు ఉన్న సినిమా టికెట్ల ధరలను 12 శాతం స్లాబ్లోకి తీసుకొచ్చారు. అంతకంటే ఎక్కువ ధర కలిగిన టికెట్లను 28 శాతం పన్ను పరిధి నుంచి 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు.