Andhra Pradesh: కేసీఆర్ టూర్ ప్రారంభం.. కుటుంబంతో విశాఖకు బయలుదేరిన టీఆర్ఎస్ అధినేత!
- కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం
- మూడ్రోజుల పాటు దేశవ్యాప్త పర్యటన
- 26న మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశం
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ వేదిక ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటించి పలు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చించనున్నారు. తాజాగా కేసీఆర్ 3 రోజుల పర్యటన ఈరోజు ప్రారంభమయింది. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం వెళ్లేందుకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
విశాఖపట్నంలోని శారదాపీఠంలో కేసీఆర్ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించనుంది. స్వామి స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నాక ఇక్కడ రాజశ్యామల ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ఆయన ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు వెళతారు. అక్కడ సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశం అవుతారు.
అనంతరం రేపు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. అదే రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ పై చర్చిస్తారు. అనంతరం ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, మాయావతిలను కేసీఆర్ కలుసుకుంటారు.
ఢిల్లీ టూర్ లో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం తెలంగాణకు తిరిగి బయలుదేరుతారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన కోసం టీఆర్ఎస్ నేతలు ఓ విమానాన్ని నెలరోజుల పాటు బుక్ చేశారు.