Andhra Pradesh: నరేంద్ర మోదీ నమ్మించి మోసం చేశాడు.. దుర్మార్గానికి కూడా ఓ హద్దు ఉంటుంది!: చంద్రబాబు
- హామీల అమలుకు బీజేపీకి చేతులు రాలేదు
- నేను 29 సార్లు ఢిల్లీకి వెళ్లి కలిశాను
- హోదా ఇవ్వాలని తొలుత బీజేపీయే కోరింది
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీలపై టీడీపీ నేతలు పార్లమెంటును మూడేళ్ల పాటు స్తంభింపజేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ఆందోళనకు దేశంలోని మిగతా పార్టీలన్నీ సహకరించాయని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తున్నామని అప్పటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిందన్నారు. అయితే రాజ్యాంగపరంగా ప్రకటించిన హామీలను అమలుపరచడానికి బీజేపీకి చేతులు రాలేదని దుయ్యబట్టారు. అమరావతిలో ఈరోజు ‘ప్రత్యేకహోదా-విభజన హామీల అమలు’పై చంద్రబాబు తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
ఎక్కడైనా దుర్మార్గానికి ఓ హద్దు ఉంటుందనీ, కానీ బీజేపీ ప్రభుత్వం దాన్ని కూడా దాటేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కోరిన ప్రతీ హామీపై కొర్రీలు పెట్టారన్నారు. తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లి కలిశాననీ, తమ పార్లమెంటు సభ్యులు ఆందోళనకు దిగారని గుర్తుచేశారు. చివరికి గత్యంతరం లేకే ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చామని వ్యాఖ్యానించారు.
2014 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని చంద్రబాబు పేర్కొన్నారు. చెంబు నీళ్లు, బుట్టెడు మట్టితో ఏపీ ప్రజలను ప్రధాని మోదీ నమ్మించి మోసం చేశారని దుయ్యబట్టారు. అసలు ఏపీ విభజనకు ముందు హోదా పాటను ఎత్తుకుంది బీజేపీనే అనీ, దాన్ని అమలు చేయకుండా అడ్డుకుంటున్నది కూడా ఆ పార్టీనే అని విమర్శించారు. రాజకీయాల్లో ఇంతకంటే దివాళాకోరుతనం ఉండదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.