visakha utsav: జనం సమస్యలతో అల్లాడుతుంటే మీకు ఉత్సవాలు కావాల్సి వచ్చిందా?: గంటాకు మావోయిస్టుల ప్రశ్న
- మావోయిస్టు నేత జగబంధు పేరుతో లేఖ విడుదల
- విశాఖ ఉత్సవాలను బహిష్కరించాలని పిలుపు
- జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్
ఓ వైపు జిల్లా ప్రజలు తుపాన్లు, కరవు, ఇతర సమస్యలతో అల్లాడిపోతుంటే ప్రభుత్వం టూరిజం పేరుతో ఉత్సవాలు నిర్వహించడం దారుణమని మావోయిస్టు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగబంధు ధ్వజమెత్తారు. పర్యాటకాభివృద్ధి పేరుతో ఈ నెల 28, 29, 30 తేదీల్లో విశాఖ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంపై విమర్శలు కురిపించారు. రాష్ట్రం, జిల్లా తీవ్రదుర్భిక్షంతో సతమతమవుతున్న పరిస్థితుల్లో ఉత్సవాల నిర్వహణ బాధ్యతారాహిత్యమన్నారు.
ప్రజలు ఈ ఉత్సవాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని 12 మండలాలు తిత్లీ తుపాన్‌తో తీవ్రంగా దెబ్బతిన్నాయని, పరిహారం అందించే విషయంలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తారు. పెథాయ్ తుపాన్ ప్రభావంతో విశాఖ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించవద్దని నిర్వాహకులు, తల్లిదండ్రులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు.