Andhra Pradesh: ఆంధ్రాకు కేంద్ర ఆర్థిక సాయం విషయంలో పవన్ కల్యాణ్ నాకు వ్యతిరేకంగా మారిపోయారు!: చంద్రబాబు
- ఏపీకి రూ.75 వేల కోట్లు రావాలని పవన్ చెప్పారు
- పోలవరాన్ని అడ్డుకునేందుకు కేంద్రం యత్నించింది
- సింగపూర్ విమాన సర్వీసుకు కొర్రీలు పెట్టారు
పోలవరం ప్రాజెక్టును సైతం అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం యత్నించిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం 67 శాతం పూర్తయినా అడ్డుపుల్లలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని అవార్డులు వస్తున్నప్పటికీ, నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. ముంబై-ఢిల్లీ పారిశ్రామికవాడకు నిధులు ఇచ్చిన కేంద్రం చెన్నై-విశాఖపట్నం కారిడార్ కు మాత్రం లోన్లు తీసుకోవాలని సలహాలు ఇస్తోందని మండిపడ్డారు. అమరావతిలో ఈరోజు ‘ప్రత్యేకహోదా-విభజన హామీల అమలు’పై చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
విజయవాడ నుంచి సింగపూర్ విమాన సర్వీసును కూడా అడ్డుకునే ప్రయత్నాలు సాగాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కు లక్ష కోట్లు ఇస్తున్నామని బీజేపీ నేతలు ఇప్పటివరకూ లక్షసార్లు చెప్పారని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఏపీకి కేంద్రం నుంచి ఇంకా రూ.75,000 కోట్లు రావాల్సి ఉందని తేల్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
కానీ తాను బీజేపీపై పోరాటం మొదలుపెట్టగానే అందరూ వ్యతిరేకంగా మారిపోయి యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఏపీకి ఐదు కాదు, పదేళ్లు హోదా ఇవ్వాలని చెప్పిన పెద్ద మనుషులు ఇప్పుడు మాటమార్చారని దుయ్యబట్టారు. అంతేకాకుండా హోదాపై గట్టిగా పోరాడితే, ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ ఎలా సంబరాలు చేసుకుంటారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రత్యేకహోదాకు వ్యతిరేకంగా వ్యవహరించిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిశామని చెప్పారు. ప్రధాని మోదీ ఏపీకి వస్తామని చెబుతున్నారనీ, ‘మేం చచ్చామా.. ఇంకా బతికే ఉన్నామా? అన్నది చూడటానికి వస్తున్నారా?’ అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తారని నిలదీశారు.