APS RTC: టెక్నాలజీ మహిమ: బస్సులో ఫోన్ పోగొట్టుకున్న ప్రయాణికుడు.. మూడు గంటల్లోనే అప్పజెప్పిన ఆర్టీసీ
- తిరుపతిలో ఘటన
- బస్సులో ఫోన్ మర్చిపోయిన చెన్నై ప్రయాణికుడు
- ట్రాకింగ్ ద్వారా గుర్తించి అప్పజెప్పిన ఆర్టీసీ
బస్సులో ఖరీదైన సెల్‌ఫోన్ పోగొట్టుకున్న ప్రయాణికుడికి మూడు గంటల్లోనే దానిని అందజేసింది ఏపీఎస్ ఆర్టీసీ. చెన్నైకి చెందిన గణేశ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చాడు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో శనివారం తెల్లవారుజామున కొండపై ఆర్టీసీ బస్సెక్కి తిరుపతిలో దిగాడు. తీరా దిగాక చూస్తే, జేబులోని సెల్‌ఫోన్ కనిపించలేదు. రూ.35 వేల విలువైన ఫోన్ కనిపించకపోయే సరికి అతడికి గుండె ఆగినంత పనైంది. వెంటనే తిరుపతి బస్టాండ్‌లోని కంట్రోలర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
గణేశ్ ఫిర్యాదుపై స్పందించిన కంట్రోలర్ గణేశ్ తీసుకున్న టికెట్ ఆధారంగా బస్సు చిత్తూరు వెళ్తున్నట్టు తెలుసుకున్నారు. ట్రాకింగ్ ద్వారా ఫోన్ బస్సులోనే ఉన్నట్టు గుర్తించిన కంట్రోలర్ వెంటనే బస్సు కండక్టర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. గణేశ్ అంతకుముందు కూర్చున్న సీటు కింద వెతగ్గా ఫోన్ కనిపించింది. అది తీసుకున్న కండక్టర్ అదే సమయంలో చిత్తూరు నుంచి తిరుపతి వెళ్తున్న బస్సును ఆపి విషయం చెప్పి ఫోన్‌ను డ్రైవర్‌కు అందించాడు. అతడు తిరుపతిలో దానిని అందించాడు. ఇలా మూడు గంటల అనంతరం పోయిన ఫోన్ గణేశ్ చెంతకు చేరింది. పోయిందనుకున్న ఫోన్‌ను తిరిగి అప్పగించిన ఆర్టీసీకి గణేశ్ కృతజ్ఞతలు తెలిపాడు.