Ayyappa: అయ్యప్ప దర్శనం కోసం పట్టుబట్టిన మహిళలు.. నిరసనకు దిగిన భక్తులు ..స్వాములపై బలప్రయోగం చేయరాదని పోలీసుల నిర్ణయం!
- స్వామి దర్శనం కోసం మరో యువతితో వచ్చిన బిందు
- కోజికోడ్ లోని బిందు ఇంటిముందు భక్తుల ధర్నా
- అతివలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా తమకు అయ్యప్ప స్వామి దర్శనం చేయించాలని కోజికోడ్, కోయిలాండీ ప్రాంతానికి చెందిన బిందుతో పాటు మరో మహిళ, పంబ నుంచి సన్నిధానానికి బయలుదేరిన తరువాత, వారిని నాదపంతాళ్ వద్ద దాదాపు 20 వేల మందికి పైగా భక్తులు అడ్డగించడంతో ఏర్పడిన ఉద్రిక్తత ఇంకా తొలగలేదు. అదనపు బలగాలను ఆ ప్రాంతానికి రప్పించిన పోలీసులు, అయ్యప్ప నామజపం చేస్తూ నిరసనలకు దిగిన భక్తులను ఖాళీ చేయించేందుకు బల ప్రయోగం చేయరాదని నిర్ణయించారు.
మరోవైపు తాము స్వామిని చూసే కిందకు వెళతామని, పోలీసుల బందోబస్తు మధ్యే ఇద్దరు మహిళలూ శరణుఘోష చేస్తూ, నిరసన తెలుపుతున్నారు. వారికి నచ్చజెప్పేందుకు పోలీసు అధికారులు చేస్తున్న ప్రయత్నం ఇంతవరకూ ఫలించలేదని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ ఉన్నందున ఎటువంటి నిరసనలకూ తావులేదని, అటు భక్తులకు, ఇటు మహిళలకు పోలీసులు చెబుతున్నారు.
స్వామి ఆలయానికి దాదాపు కిలోమీటర్ దూరంలో మహిళలు ఉన్నారు. వారికి స్వామి దర్శనం చేయించేందుకు తాము ప్రయత్నిస్తామని అధికారులు వెల్లడించారు. నీలక్కల్ నుంచి సన్నిధానం వరకూ 2 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని, భక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే, అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలావుండగా, కోజికోడ్ లోని బిందు ఇంటిముందు బీజేపీ ఆధ్వర్యంలో కొన్ని హిందూ సంఘాల కార్యకర్తలు ధర్నాకు దిగాయి.