Telangana: టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం.. నేడు హైకోర్టుకు వెళ్లనున్న కాంగ్రెస్ పార్టీ!
- టీఆర్ఎస్ లోకి నలుగురు నేతల ఫిరాయింపు
- విలీనం చేస్తూ చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం
- మార్చితో మండలిలో ఖాళీ కానున్న కాంగ్రెస్
తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఆరుగురు సభ్యుల్లో నలుగురు అధికార టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆ పార్టీకి మండలిలో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి మాత్రమే మిగిలారు. కాగా, ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్సీలు సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ ఇచ్చిన లేఖను మండలి చైర్మన్ స్వామిగౌడ్ సైతం ఆమోదించారు. తాజాగా ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైకోర్టును ఆశ్రయించనుంది. ఫిరాయింపుదారులపై తొలుత చర్యలు తీసుకున్నాకే, విలీనంపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరనుంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకుల లలిత, సంతోష్ కుమార్, ప్రభాకర్ రావు, దామోదర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. దీంతో మండలిలో కాంగ్రెస్ తరఫున ఇద్దరే మిగిలారు. కాగా, షబ్బీర్ అలీ, పొంగులేటి పదవీకాలం సైతం 2019 మార్చితో ముగియనుంది. తాజా ఫిరాయింపుల నేపథ్యంలో మండలిలో కాంగ్రెస్ కు చోటే లేకుండా పోనుంది.