Yadagirigutta: యాదగిరిగుట్ట నవీనాలయం ప్రారంభ తేదీల ఖరారు!
- మార్చి 3 లేదా 13 బాగున్నాయి
- ఖరారు చేసిన త్రిదండి రామానుజ చిన జీయర్
- నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసిన అధికారులు
యాదగిరిగుట్టలో పునర్నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన గర్భాలయాన్ని ప్రారంభించేందుకు మార్చి 3 లేదా 13 తేదీలు ముహూర్తానికి బాగున్నాయని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి ఖరారు చేసినట్టు స్తపతి సుందరరాజన్ వెల్లడించారు. ఆలయ ప్రారంభ తేదీలను కేసీఆర్ తో చర్చించిన మీదట ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. దీంతో మిగిలివున్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇప్పటికే సప్త రాజగోపురాలు, ధ్వజస్తంభ పీఠం, బలిహరణ పీఠం సిద్ధంకాగా, గర్భాలయంలో ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. మరో మూడు వారాల్లోగా గర్భాలయ నిర్మాణం పూర్తి అవుతుందని, ఆపై మార్చిలోగా ఆలయ మాడవీధులు, రాజగోపురాల మధ్య శిల్పాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదిలావుండగా, ఆలయ నిర్మాణ తీరును పరిశీలించేందుకు జనవరి మొదటి వారంలో కేసీఆర్ యాదాద్రిని సందర్శిస్తారని తెలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే కేసీఆర్ పర్యటన ఉండవచ్చని సమాచారం. పనులను పరిశీలించిన తరువాత ఆలయ ప్రారంభతేదీ అధికారికంగా ఖరారవుతుంది.