Andhra Pradesh: నన్ను వెంటనే విధుల్లోకి తీసుకోండి.. టీటీడీ ఈవోకు రమణదీక్షితులు లేఖ!
- హైకోర్టు తీర్పును వర్తింపజేయాలని విజ్ఞప్తి
- గత మే నెలలో దీక్షితులను తప్పించిన టీటీడీ
- ఆగమ నిబంధనల విషయంలో చెలరేగిన వివాదం
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఈరోజు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు లేఖ రాశారు. తనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. మిరాశి అర్చకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును తనకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్ర నిబంధనల విషయంలో గతంలో ఏపీ ప్రభుత్వానికి, రమణ దీక్షితులకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో 65 ఏళ్లు పూర్తయిన అర్చకులకు విశ్రాంతి ఇవ్వాలనీ, కొత్తవారిని తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయించింది. ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకోవడంతో గత మే నెలలో రమణ దీక్షితులతో పాటు మరికొందరు అర్చకులను విధుల నుంచి తప్పించారు. దీనిపై రమణ దీక్షితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.