Mukesh Ambani: కిందకు దిగిన జాక్ మా... ఆసియాలోనే కుబేరుడు ముఖేష్ అంబానీ!
- ఈ ఏడాది మరో 4 బిలియన్ డాలర్లు పెరిగిన ముఖేష్ సంపద
- 43.2 బిలియన్ డాలర్ల ఆస్తితో ఆసియా కుబేరుడిగా గుర్తింపు
- 35 బిలియన్ డాలర్లకు తగ్గిన జాక్ మా సంపద
నిన్నటివరకూ ఇండియాలో అత్యంత ధనవంతుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఇప్పుడు ఆసియాలోనే అత్యధిక సంపద ఉన్న వ్యక్తుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న చైనా ఈ-కామర్స్ సంస్థ ఆలీబాబా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ మాను ముఖేష్ అధిగమించారు. గడచిన ఏడాది కాలంలో పరుగులు పెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈక్విటీ విలువ, అంబానీ సంపదను మాత్రం 4 బిలియన్ డాలర్ల మేరకు పెంచింది. దీంతో ముఖేష్ ఆస్తుల విలువ 43.2 బిలియన్ డాలర్లకు చేరగా, ఇదే సమయంలో జాక్ మా సంపద 35 బిలియన్ డాలర్లకు తగ్గిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది.
ఈ సంవత్సరం ఆసియాలోని 128 మంది ధనవంతుల ఆస్తుల విలువలో 137 బిలియన్ డాలర్లు కరిగిపోయాయని పేర్కొంది. గడచిన ఆరేళ్లలో ఆసియా సంపన్నుల సంపద తగ్గిపోవడం ఇదే తొలిసారని, వివిధ దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, స్టాక్ మార్కెట్ పతనం ఇందుకు కారణమని బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. చైనా, ఇండియా, దక్షిణ కొరియా దేశాల్లోని ధనవంతులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, 40 మంది చైనా కుబేరుల్లో మూడింట రెండొంతుల మంది సంపద కరిగిపోయిందని తెలిపింది. ఈ జాబితాలో ఇండియాకు చెందిన 23 మంది కుబేరులు ఉండగా, వారి సంపదలో 21 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి.