Chandrababu: ప్రార్థన చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- బైబిల్ ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది
- సేవకు మారుపేరు క్రైస్తవులు
- గుంటూరులో క్రైస్తవ భవనం నిర్మిస్తున్నాం
ప్రార్థన చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని, పవిత్ర గ్రంథం బైబిల్ ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు క్రిస్మస్ పండగ సందర్భంగా విజయవాడలోని సెయింట్ పాల్స్ బసలికా చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సేవకు మారుపేరు క్రైస్తవులు అని, మిషనరీ పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారు ఈరోజు ఉన్నత పదవుల్లో ఉన్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా మానవతామూర్తి మదర్ థెరిస్సా గురించి ఆయన ప్రస్తావించారు. చరిత్ర ఉన్నంత వరకూ ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. గుంటూరులో క్రైస్తవ భవనం నిర్మిస్తున్నామని, బసలికా చర్చికి రూ.1.5 కోట్లను గ్రాంటుగా ఇచ్చి అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెల్లకార్డు దారులకు క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నామని, దళిత క్రిస్టియన్లందరికీ ‘ఎస్సీ’ హోదా కల్పించే వరకూ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.100 కోట్లను కేటాయించనున్నట్టు చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులు హాజరయ్యారు.