kcr: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఒక కుట్ర.. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం: ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ
- ఫెడరల్ ఫ్రంట్ వెనుక మోదీ, అమిత్ షాలు ఉన్నారు
- రానున్న పార్లమెంటు ఎన్నికలు దేశానికి చాలా కీలకం
- తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్... తాజాగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి అయిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై ఏఐసీసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ గౌడ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేవలం ఎన్డీయే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ యత్నిస్తున్నారని రాజీవ్ గౌడ ఆరోపించారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనుక ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఉన్నారని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలు దేశానికి ఎంతో కీలకమని... ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.