praja vedika: ప్రజావేదికలో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- సామాజిక సాధికారత- సంక్షేమంపై శ్వేతపత్రం
- పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
- పేదరికం పోయేందుకు సంపద సృష్టిపై దృష్టి పెట్టాం
ఏపీలో సంక్షేమ రంగంలో సాధించిన ప్రగతిపై శ్వేత పత్రంను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. అమరావతిలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో సామాజిక సాధికారత- సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేశారు.
అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ, తాము అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో పేదరికం పోయేందుకు సంపద సృష్టిపై దృష్టి పెట్టామని, అంబేద్కర్ స్ఫూర్తిగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆదాయం పెంచే చర్యలు చేపట్టామని, కుటుంబ వికాసం, సమాజ వికాసం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని, ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయం సంపాదించాలని అన్నారు.
ఏ ప్రయోజనం కల్పించినా మహిళ పేరుతో అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. పేదరికంపై గెలుపు కార్యక్రమంతో ఆర్థిక అసమానతలను తొలగిస్తున్నామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవే కాకుండా, లేనివి అనేకం అమలు చేస్తున్నామని, ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని, ప్రజల అవసరాలను గుర్తించి వారి కష్టాలను తీరుస్తున్నామని, పేద వాళ్ల కోసం కష్టపడే ప్రభుత్వం తమదని అన్నారు. సమాజంలో ప్రతిఒక్కరూ ఆనందంగా ఉండాలని, దానికి అనుగుణంగా దార్శనిక పత్రాన్ని రూపొందించుకున్నామని, తాను కష్టపడేది ఐదు కోట్ల ప్రజల కోసమేనని అన్నారు.