kala venkatrao: అవినీతిపరులను విదేశాలకు పంపేందుకు ఏపీకి వస్తున్నారా?: మోదీకి కళా వెంకట్రావు ప్రశ్న
- ఎన్నికలు వస్తేకానీ ఏపీ ప్రజలు గుర్తుకు రారా?
- ఇక్కడకు వచ్చి మీరు చేసేదేముంది?
- లాలూచీ రాజకీయాల వల్లే జగన్ కేసులు కొలిక్కిరావడం లేదు
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి ఏపీ మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ఏపీకి అంతులేని ద్రోహం చేసిన మోదీ ఇక్కడకు వచ్చి చేసేదేముందని లేఖలో ఆయన ప్రశ్నించారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తేగాని, ఏపీ ప్రజలు గుర్తుకు రారా? అని మండిపడ్డారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ 2014 ఎన్నికల సమయంలో మోదీ వ్యాఖ్యానించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. తల్లీబిడ్డలను చంపే విధంగా మోదీ చర్యలు ఉన్నాయని విమర్శించారు.
తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా హామీలు ఇచ్చి... ఆ తర్వాత మోదీ మోసం చేశారంటూ కళా వెంకట్రావు మండిపడ్డారు. రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రానికి కేవలం రూ. 3,979 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులపై కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. మోదీతో ఉన్న లాలూచీ రాజకీయాల వల్లే జగన్ పై ఉన్న కేసులు కొలిక్కిరావడం లేదని అన్నారు. రాష్ట్రంలోని అవినీతిపరులను విదేశాలకు పంపేందుకు ఏపీకి వస్తున్నారా? అని ప్రశ్నించారు.