KCR: కేసీఆర్ ను కలిసిన రెండు రోజులకే... తన ఎంపీని చంద్రబాబు వద్దకు పంపిన నవీన్ పట్నాయక్!
- బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కూటమి
- ఆదివారం నవీన్ పట్నాయక్ తో కేసీఆర్ చర్చలు
- సౌమ్యా రంజన్ పట్నాయక్ తో లేఖను పంపిన నవీన్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే భాగంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, స్వయంగా ఒడిశా వెళ్లి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసి చర్చించి వచ్చిన రెండు రోజులకే కీలక పరిణామం చోటు చేసుకుంది. తన పార్టీ ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ ను మంగళవారం అమరావతికి పంపించిన నవీన్ పట్నాయక్, చంద్రబాబుకు ఓ లేఖను పంపారు. తాను కూడా బీజేపీ దిగిపోవాలని కోరుకుంటున్నానని, అందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని తన లేఖలో నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పైనా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మరోసారి బీజేపీ రాకూడదన్నది తమ సీఎం అభిప్రాయమని చంద్రబాబుతో చెప్పిన సౌమ్యా రాజన్, ఈవీఎంలకన్నా, బ్యాలెట్ పేపర్లపైనే తమకు ఎక్కువ విశ్వాసముందని అన్నారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే అంశాన్ని కంప్యూటర్ చిప్ లను తయారు చేసే మేనేజర్ల చేతిలో పెట్టడం ప్రమాదకరమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సౌమ్యా రంజన్ కూడా అంగీకరించారు. వీరిద్దరి భేటీలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు కూడా పాల్గొన్నారు.