Nitin Gadkari: బీజేపీలో కాక పుట్టిస్తున్న నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు!

  • నేను అధ్యక్షుడినైతే ఓటమికి నాదే బాధ్యత
  • నావారు పనిచేయకుంటే తప్పెవరిది?
  • ఇంటెలిజెన్స్ అధికారుల సమావేశంలో గడ్కరీ

"నేను పార్టీ అధ్యక్షుడిని అయినప్పుడు, నా పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు సరిగా పనిచేయనపుడు తప్పెవరిది? నాదే కదా?" అంటూ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తూ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో కాకపుట్టిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలను లక్ష్యంగా చేసుకుని, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులను ఉద్దేశించి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తులు సరిగా పనిచేయకపోయినా, ఆశించిన ఫలితాలు దక్కకపోయినా నాయకులే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
 
" ఒక విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. దేశంలో హోమ్ శాఖ సమర్థంగా పనిచేస్తోందంటే, సుశిక్షితులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే కారణం. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల్లో చాలా మంది సచ్చీలురని, చక్కగా పని చేస్తూ, తమ విధులను నిర్వర్తిస్తున్నారని నేను నమ్ముతున్నాను. నేను పార్టీ అధ్యక్షుడిని అయి, నా ఎమ్మెల్యేల పనితీరు, నా ఎంపీల పనితీరు సంతృప్తికరంగా లేదంటే అందుకు బాధ్యత నాదే. వారిని నేను సరిగ్గా నడిపించలేదనే భావించాలి" అని గడ్కరీ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ఇండియాలో జరుగుతున్న మతపరమైన ద్వేషం పెరగడాన్ని కూడా గడ్కరీ ప్రస్తావించారు. తొలి ప్రధాని నెహ్రూ ప్రసంగాలంటే తనకు ఇష్టమని చెప్పారు. గత వారంలో మూడు రాష్ట్రాల ఓటమికి బీజేపీ జాతీయ నాయకులదే బాధ్యతని వ్యాఖ్యానించిన గడ్కరీ, తాజాగా మరోసారి నిరసన గళం వినిపించడంతో బీజేపీలో వాడివేడి చర్చ జరుగుతోంది. 

  • Loading...

More Telugu News