maoistst: వారి ముగ్గురమ్మాయిలదీ మావోయిస్టు ఉద్యమంతోనే ప్రయాణం!

  • వారసత్వంగానే మావోయిస్టులవైపు ఆకర్షణ
  • తీవ్రకలకలానికి కారణమైన హైదరాబాద్‌ అక్కచెల్లెళ్ల అరెస్టు
  • జనారణ్యంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని బయటపెట్టిన సంఘటన

మావోయిస్టులంటే ఏ మారుమూల అడవుల్లోనో, కొండకోనల్లోనో దాక్కుని ఉద్యమాన్ని నిర్వహిస్తుంటారన్న భావన సాధారణంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని అడవులను జల్లెడపడుతుండడంతో మావోయిస్టులూ తమ పంథా మార్చారు. ఇందులోభాగంగా అర్బన్‌ నక్సలిజం ఎప్పుడో ఊపిరి పోసుకుందన్న ఊహాగానాలు ఉన్నా హైదరాబాద్‌లోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అరెస్టుతో ఇది వాస్తవమని బయటపడింది.

సీపీఐ మావోయిస్టు పార్టీ, అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్న ఆత్మకూరు భవాని, అన్నపూర్ణ, అనూషలను విశాఖ జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేయడం తీవ్ర కలకలానికి కారణమైంది. వీరితోపాటు పెదబయలు ఏరియా కమిటీకి చెందిన మిలీషియా సభ్యుడు కొర్రా కామేశ్వరరావును అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు పదిహేను రోజుల రిమాండ్‌ విధించింది. మావోయిస్టుల ఉద్యమంతో వీరికి సంబంధం ఉందంటూ పోలీసులు ఈ సందర్భంగా పెద్ద చరిత్రనే బయటపెట్టారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌ కాప్రా సర్కిల్‌ హెచ్‌బీకానీలోని వెంకటేశ్వర్‌నగర్‌కు చెందిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు, కుటుంబ వారసత్వంగా అబ్బిన లక్షణాలతోనే ఉద్యమ బాటపట్టారని పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బోదవాడ పంచాయతీ తిమ్మయ్యపాలేనికి చెందిన ఆత్మకూరు రమణయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులు బతుకు దెరువు వెతుక్కుంటూ హైదరాబాద్‌ వలస వచ్చి వెంకటేశ్వరనగర్‌లో స్థిరపడ్డారు. రమణయ్య టైలరింగ్‌ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన కులనిర్మూన పోరాట సమితిలో పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజాఫ్రంట్‌లో పనిచేస్తున్నారు. తల్లి నర్సమ్మ కూడా ప్రజాపోరాట సంఘంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.

వీరి పెద్ద కుమార్తె భవానీ తండ్రికి చేదోడువాదుడుగా ఉంటోంది. అన్నపూర్ణ, అనూషలు చైతన్య మహిళా సంఘంలో సభ్యులు. మావోయిస్టు దళంలో సభ్యులుగా, కార్యదర్శులుగా పనిచేశారు. భవాని అమరవీరుల బంధుమిత్రుల కమిటీ తెలుగు రాష్ట్రాల సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అన్నపూర్ణ విశాఖలో ఉంటూ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, అనూష తార్నాక్‌లోని రైల్వే కళాశాలలో డిగ్రీ చదువుతోంది.

కొన్నాళ్లక్రితం అనూష మావోయిస్టు అగ్రనాయకుడు అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే)ను కలిసి ఉద్యమంలో చేరింది. యాంగ్జేగా పేరు మార్చుకుని యూనిఫాం ధరించి కోటిపల్లి, గున్నమామిడి ప్రాంతాల్లో శిక్షణ కూడా తీసుకుంది. అనంతరం పోలీసులపై కాల్పులు, రెక్కీ నిర్వహణ వంటి కార్యకలాపాల్లో పాల్గొంది. ఆ తర్వాత అర్బన్ నక్సల్ అవతారం ఎత్తింది. భవానీని గతంలో కడప జిల్లా పోలీసులు, అన్నపూర్ణను వరంగల్‌ జిల్లా పోలీసులు ఇతర కేసుల్లో అరెస్టు చేశారు.

ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉందని పోలీసులు ఆరోపిస్తుండగా వారి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెలకు మావోయిస్టులతో ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. పలు సంఘటనల్లో చనిపోయిన మావోయిస్టుల శవాలను వారి కుటుంబ సభ్యులకు అందించడంలో తన భార్య భవానీ మానవతా దృక్పథంతో పనిచేస్తుంది తప్ప, ఆమెకు మావోయిస్టులతో ఎటువంటి సంబంధం లేదని భవానీ భర్త క్రష్ణ అన్నారు. తన భార్య, మరదళ్లకు పోలీసులు ఎటువంటి హాని తలపెట్టకుండా విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News